||సుందరకాండ ||

||నలభైనాలుగొవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుశ్చత్వారింశస్సర్గః||

ప్రహస్తుని పుత్రుడు మహత్తరమైన కోరలు గలవాడు ధనస్సు ధరించినవాడు బలవంతుడు అగు జంబుమాలి రాక్షసేంద్రుని చే అదేశించబడినవాడై అక్కడనుంచి వెళ్ళెను.

ఆ జంబుమాలి ఎఱ్ఱనిపూల మాలలూ వస్త్రములు ధరించినవాడు. చెవులకు మంచి కుండలములు ధరించినవాడు. పెద్దగా కళ్ళు గిరగిరా తిప్పుతున్నవాడు. సమరములో దుర్జయుడు. అతడు శక్తిమంతమైన బాణములను ప్రయోగించు ఇంద్రధనస్సుపోలిన ధనస్సుతో , వజ్రాయుధము పోలిన భయంకరమైన ధనుష్టంకారములు చేయుచూ, వేగముగా యుద్ధమునకు వెళ్ళెను. అతని ధనస్సుయొక్క భీషణ నాదములు అన్ని దిశలనూ అకాశమునూ పూర్తిగా నింపినవి.

వేగమే సంపదగా గల యుద్ధమునకు సిద్ధముగా నున్న హనుమంతుడు గాడిదలు పూన్చిన రథముపై ఎక్కి వచ్చుచున్న వానిని చూచి సంతోషముతో గొప్ప నాదము చేసెను.

మహాబాహువులు కల జంబుమాలి నిశితమైన బాణములతో ఆ తోరణము ఎక్కి కూర్చునివున్న మహాకపిపై ప్రయోగించెను. అర్థ చంద్రాకారము కల బాణమును ముఖము మీద ఒకటి, వంకరములికి వున్న బాణమును శిరస్సుపై, పది బాణములు బాహువులపై ప్రయోగించి ఆ వానరుని బాధించెను. ఆ శరములచే కొట్టబడిన హనుమంతుని ఆ ఎర్రని ముఖము శరత్కాల సూర్య కిరణములచే వికసింపబడిన ఎఱ్ఱతామర పూవు వలె భాసించెను. ఆ ఎఱ్ఱని రక్తముతో రంజితమైన ఆయన ముఖము ఆకాశమున రక్త చందన బిందువులతో రంజితమైన మహా పద్మము వలె భాసించెను.

రాక్షస బాణములచే కొట్టబడిన హనుమంతుడు ఉద్రేకుడు అయ్యెను. అప్పుడు తనపక్కన అతివిపులమైన శిలను చూచెను. ఆ బలవంతుడు ఆ శిలను పైకి ఎత్తి బలముతో విసిరెను. ఆ రాక్షసుడు దానిని పది బాణములతో ఛిన్నాభిన్నము చేసెను.

చండవిక్రముడు వీరుడు అగు హనుమంతుడు ఆ పని విఫలము కావడము చూచి, ఒక పెద్ద సాలవృక్షమును పెకిలి దానిని గిరగిరా తిప్పసాగెను. ఆ సాలవృక్షమును గిర గిరా తిప్పుతున్న ఆ వానరుని చూచి మహాబలుడైన జంబుమాలి అనేక మైన బాణములను ప్రయోగించెను. నాలుగు బాణములతో సాల వృక్షమును, వానరుని భుజముల మీద ఇదు బాణములతో, ఉదరము పై ఒకబాణముతో వక్షస్థలముపై పది బాణములతో ఛేధించెను.

శరములతో నిండిన తనువు గల అతడు మహత్తరమైన క్రోధముతో వేగముగా అపరిఘనే తీసుకొని గిర గిరా తిప్పసాగెను. సాటిలేని పరాక్రమము గల వాడు అతివేగము గలవాడు అగు హనుమంతుడు పరిఘను అతివేగముగా తిప్పుచూ జంబుమాలి వక్షస్థలముపై కొట్టసాగెను. అప్పుడు ఆ దెబ్బతో అక్కడ వాడి శిరస్సులేదు. బాహువులు లేవు. జానువులు లేవు. ధనస్సు లేదు. రథములేదు. అశ్వములు కూడా కనపడుటలేవు. మహాబలవంతుడైన జంబుమాలి వానరునిచేత హతమార్చబడి, అంగములన్నీ చూర్ణము చేయబడినవాడై భూమి మీద పడెను.

రావణుడు మహాబలవంతులైన కింకరులు అలాగే జంబుమాలి కూడా హతమార్చబడడము విని కోపముతోఎఱ్ఱబడిన కళ్ళు కలవాడు అయ్యెను. ఆ నిశాచరేశ్వరుడు రోషముతో ఎఱ్ఱని కళ్ళు కలవాడై మహాబలుడైన ప్రహస్తుని పుత్రుడు హతమార్చబడడముతో మహావీరులు అగు అమాత్యపుత్రులకు వెంటనే ఆదేశము ఇచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైనాలుగొవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||